10, జులై 2018, మంగళవారం

వృధా

   అన్నమయ్య   ఎలాగంటున్నాడో చూడండి !   ఈ  భూమిపై ,  అన్నీ  వృధా, వ్యర్థం. ఈ క్రింది  పాటలో, ఏది. ఈ ప్రపంచంలో   ఉపయోగపడే విషయం ?  ఏది ఉపయోగ పడదో  వివరించారు.     

           “ వెఱపులు  వొరపులు  వృధా  వృధా , ధరపై  మరి అంతయును వృధా “ (1, సంకీర్తన 217)

  అన్ని బంధాలూ  వృధానే. ఎందుకంటే,  పోయేటప్పుడు అవన్నీ విడచి పోవాలిగా!!!
ఎవ్వరూ  నీతో  వెంట రారు గదా!!! మరి, ఈ బంధుత్వాలకోసం  ఎన్నో  చెడ్డ  పనులు చేసి,  ఎంతో పాపాన్ని 
కూడకట్టుకొని,  నాది నాది అంటూ ఎన్నో  కస్టాలు భరించితే,  చిట్టా చివరికి  నీతో  ఎవ్వరైనా వస్తున్నారా? ??
ఒక్కడివే వస్తావు.  ఒంటరిగా పోతావు.  అందుకని , ప్రాపంచికత  వ్యర్థం, అంటారు అన్నమయ్య. 
                         
             “  తడయక  చేసిన  దానంబులు వృధా,  ఎడయక  ఎరిగిన  ఎరుక వృధా 
                 ఒడలిలోని  హరినొనరగ  మతిలో ,  తడవని జీవమే  తనకు  వృధా “
మనలోనున్న  దైవాన్ని , మనస్సులో తలచుకోని  జీవితం, ఎన్ని దానాలు చేసినా  వ్యర్ధమే. 

                “ జగమున బడసిన  సంతానము వృధా, తగిలి గడించిన  ధనము  వృధా 
                    జగదేక విభుని  సకలాత్ముని  హరి , తెగి కొలువని  బుద్ధియును  వృధా “
అన్నిజీవులలోనున్న   సర్వాంతర్యామియైన  హరిని  మెచ్చి పూజించక,  పడీపడీ సంపాదించిన  సంపదలు, 
సంతానమూ  వ్యర్ధమే.   

                      “ పనివడి  కూడిన  పరిణామము వృధా , వొనరగ వుండిన  ఉనికి  వృధా 
                            ఘనుడగు  తిరువేంకటగిరి  హరిగని ,  మననేరని  జన్మములు  వృధా “
శ్రీ వెంకటా ద్రి  మీద  నెలకొన్న  గొప్పవాడైన వేంకటేశ్వరుని  హరిని,  ఆ వేంకటేశ్వరుని మనసార  పూజించక, 
చేసిన అనేకమైన  పనులు , వాటి  ఫలములు , ఉండే  వునికే  వ్యర్ధము,  అన్నారు అన్నమయ్య. 

సారాంశమేమిటంటే , అంటే,  ఈ  జన్మమెత్తినందుకు , సాఫల్యము  శ్రీ హరి స్మరణమే. 
మిగిలిన  పనులేవైనా చేయక తప్పదు గనుకే చేయాలి.  అవీ  ధర్మబద్ధమైన  పనులే చేయాలి. 
సంపదలూ,  సంతానములూ,  సంబంధాలూ ,  బాంధవ్యాలూ, పదవులూ, పేర్లూ ...... అన్నీయూ , 
శ్రీ వేంకటేశ్వరుని పూజించినపుడే,  సార్ధకమౌతాయి గానీ, లేకుంటే , వృధా అయి  ఫలించవు. 
దైవాన్ని మరువకుండా  , మంచి బుద్ధితో   జీవితాన్ని  గడపమని  అన్నమయ్య వేదాంతం. 

                     అన్నమయ్య మాట 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి